చేప చంపేసింది..

చేప చంపేసింది.. అవును మీరు వింటుంది నిజమే.. చేప చంపేసింది. ఇప్పుడు ఆ చేపపై ఐపీసీ సెక్షన్ కింద హత్య కేసు కూడా నమోదైంది. ఈ వింత ఘటన విశాఖ సముద్ర తీరంలో జరిగింది.

ఎక్కడైనా చేపను చంపి తింటారు. కానీ ఇక్కడ చేప మనిషిని చంపేసింది. ఈ వింత ఘటన.. విశాఖ సముద్ర తీరంలో జరిగింది. ముత్యాలంపాలెంకు చెందిన కొంత మంది మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. తీరం నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత చేపల కోసం వల వేశారు. పడవ పై నుంచి వల లాగుతున్న సమయంలో బరువుకు పైకి రాలేదు.

వల బరువుగా ఉండడం బలంగా పైకి లాగితే తెగిపోతుందని.. జోగన్న అనే మత్స్యకారుడు సముద్రంలోకి దూకాడు. ఆ సమయంలో కొమ్ముకోనాం అనే చేప జోగన్నపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో జోగన్న మృతదేహాన్ని తోటి మత్స్యకారులు ఒడ్డుకు చేర్చారు.
పదునైన కత్తిలాంటి కొమ్ము ఉండే కొమ్ముకోనాం చేప దాడి చేయడం వల్లనే జోగన్న మృతి చెందినట్టు మత్స్యకారులు పోలీసులకు తెలిపారు.

కొమ్ముకోనాం చేపలు వలలకు చిక్కడం అసాధారణం.. ఒక్కోసారి చిక్కినా వలను తెంచుకుని తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. వీటి బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ చేప వలకు చిక్కిందంటే ఆ రోజు మత్స్యకారులకు లాభాలు వచ్చినట్టేనని భావిస్తారు. అయితే దాడి చేసే కొమ్ముకోనాం చేపలు మళ్లీ విశాఖ తీరంలో కనిపిస్తుండడంతో మత్స్య్కకారులు భయాందోళనలకు గురవుతున్నారు. లాభాలు తెచ్చిపెట్టే చేప అయినా తమపై ఎప్పుడు ఎలా దాడి చేస్తోందోనని భయపడుతున్నారు.

జోగన్న బృందం సముద్రంలో వేసిన వల బరువుగా ఉండడంతో పైకి లాగేందుకు కష్టమవడంతో జోగన్న సముద్రంలోకి దూకి వలను పైకి తోసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో కొమ్ముకోనాం చేప ఒక్కసారిగా బలంగా కొట్టింది. దీంతో జోగన్న అక్కడికక్కడే పడిపోవడంతో అప్రమత్తమైన తోటి మత్స్యకారులు పడవలోకి తీసుకుని వచ్చారు. అప్పటికే జోగన్న మరణించినట్టు మత్స్యకారులు తెలిపారు.

ఇక సముద్రంలో ఎక్కువగా దొరికే కొమ్ముకోనాం చేపలు ఒక్కొక్కటి 20 నుంచి 250 కిలోల వరకు బరువు ఉంటాయి. ఇవి గ్రూపులుగా సంచరించడంతో ఎక్కువ సంఖ్యలో వలకు చిక్కుతాయి. తమకు అపాయం ఉందని భావిస్తే.. తోటి చేపలపైన, మనుషులపైనా దాడి చేస్తాయి. పెద్ద మొత్తంలో ఈ చేపలు దొరికితే వీటిని స్థానిక మత్స్యకారులు ఎక్స్ పోర్ట్ చేస్తారు.

సముద్రంలో జోగన్నపై దాడి చేసి చంపేసిన కొమ్ముకోనాం చేపపై పరవాడ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. విశాఖ తీరంలో ఒక చేప మనిషిపై దాడి చేసి చంపేయడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీసులు చేపపై కేసు నమోదు చేయడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 953 Total Views,  1 Total Views Today

Comment Your Views