తెలంగాణలో బీజేపీ బండిని లాగుతున్నదెవరు?

తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు తర్వాత దుబ్బాక ఎన్నికలో ఘన విజయం సాధించడంతో తెలంగాణలో బీజేపీ బలపడుతోందని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దుబ్బాక విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. దీంతో జీహెచ్ఎంసీలో ఎలాగైనా గెలవాలని బీజేపీ కృషి చేస్తోంది.

దుబ్బాకలో విజయం సాధించడంతో జీహెచ్ఎంసీలో విజయం కూడా వరిస్తుందని ఆ బాధ్యతను బండి సంజయ్ భుజానికెత్తుకున్నారు. ఎలాగైనా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ కార్యకర్తలు అహర్నిశలు పాటు పడుతున్నారు. ఈ ఎన్నికలను అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సారి కూడా మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని ఆ పార్టీ పాటు పడుతోంది. మేయర్ స్థానానికి ఆ పార్టీ నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. మేయర్ అభ్యర్ధిని బీజేపీ ప్రకటించలేదు.

అభ్యర్థుల ఖరారు కోసం అన్ని పార్టీలు కసరత్తులు చేశాయి. టీడీపీ సైతం జీహెచ్ఎంసీలో పట్టు సాధించాలని అభ్యర్థులను నిలబెట్టింది. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. పార్టీని తెలంగాణలో బలపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా జనసేన ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉంటుందంటూ ఆ పార్టీ ప్రకటన చేసింది. అంతే కాకుండా ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధులు ఎవరికి కూడా నేర చరిత్ర లేదంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు టికెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని.. జనసేన బీజేపీ పొత్తు కేవలం ఏపీ వరకే ఉంటుందంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తేల్చి చెప్పేశారు. ఇప్పటి వరకు తమను పొత్తుల కోసం ఎవరూ సంప్రదించలేదన్నారు. ఓ వైపు జనసేన పోటీ పై క్లారిటీ ఇవ్వడం, బీజేపీ కూడా తాము ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని చెప్పడంతో జనసేన నాయకులు ప్రచారానికి సిద్ధమయ్యారు. తమకు తెలిసిన వారి దగ్గర మొదటిసారి జనసేన పోటీ చేస్తోంది మత రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు లేని జనసేనకు మద్దతివ్వండి అంటూ ప్రచారం కూడా చేసుకున్నారు.

ఇంతలోనే సీన్ రివర్స్ అయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మాకు ఎవరితో పొత్తు అవసరం లేదని చెప్పినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలు జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరు పార్టీల నేతలు జనసేన నాయకుల గుండెల్లో పెను బాంబు లాంటి ప్రకటన చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఓట్లు చీలిపోకుండా ఉండడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ నుంచి జనసేన తప్పుకుంటున్నట్టు పవన్ ప్రకటించేశారు.


ఓ పక్క రాష్ట్ర పార్టీ చీఫ్ మాకు ఎవరి మద్దతు అవసరం లేదు, మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు అని ప్రకటన చేస్తే ఆ పార్టీకి చెందిన నాయకులు వెళ్లి పవన్ మద్దతు అడగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వ్యవహారం అంతా బండి సంజయ్ కి తెలిసే జరిగిందా? లేదా ఆ నాయకులు తమ సొంత నిర్ణయాలు తీసుకుని పవన్ కళ్యాణ్ ని కలిశారా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ పార్టీ చీఫ్ వద్దన్నకా కూడా పవన్ మద్దతు కోరడం ఎందుకో తెలియడం లేదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ఎవరి మద్దతు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని బండి సంజయ్ భావిస్తే ఆ పార్టీ నాయకులు మరొకటి తలచారు. దీంతో ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే అందులో కొంత క్రెడిట్ జనసేన కొట్టేస్తుంది. మరి వన్ అండ్ ఓన్లీగా పోటీలోకి వెళ్దామనుకున్న బండి సంజయ్ ఆశలు గల్లంతయ్యాయి.

బీజేపీ నేతలతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో జనసేన నాయకులు, కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణలో పోటీ చేయని జనసేన మొదటి సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అందరూ భావించారు. ఈ మేరకు జనసేన తెలంగాణ శాఖ కూడా అభ్యర్ధులను ఖరారు చేసేందుకు సిద్ధమైంది. కొంత మంది అభ్యర్ధులతో జాబితాను సైతం విడుదల చేసేందుకు పూనుకున్నారు. కానీ అంతలో బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు అందడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి ఉండేందుకు తెలంగాణ జనసైనికులు సిద్ధపడడం లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందనుకున్న వారు ఇప్పుడు తమ ప్రత్యర్ధులుగా ఉండే వారికి మద్దతివ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. బీజేపీ పార్టీ చీఫ్ మాకు ఎవరి మద్దతు వద్దని బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు వారికి మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నారో అర్ధం కావడం లేదని జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Like our Facebook Page – Chudu Babai

 

Think Before Using Money Lending Apps- Read Here

 1,719 Total Views,  1 Total Views Today

Comment Your Views