చరిత్ర మరవని రోజు దివిసీమ ఉప్పెన @ 43 ఏళ్లు

దివిసీమ ఉప్పెన

దివిసీమ ఉప్పెన @43 ఏళ్లు

అదో కాళరాత్రి.. ఉగ్రరూపం దాల్చిన సముద్రుడు వందలాది  గ్రామాలపై కాటువేశాడు.  ప్రకృతి విలయతాండవానికి కళ్లు మూసి తెరిచేలోపు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అది 1977 నవంబర్ 19.. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్న చిరుజల్లులుగా మొదలైన వాన తీవ్ర రూపం దాలుస్తుందని ఆ ప్రాంతం వారు ఊహించలేకపోయారు. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తాటి చెట్టు ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. ఆ అలల ధాటికి గ్రామాలు గ్రామాలే కనుమరుగయ్యాయి. అదే దివిసీమ ఉప్పెన.

ఊహించని ప్రళయం ఆ గ్రామాన్ని రూపురేఖలు లేకుండా మార్చివేసింది. సుమారు రెండు గంటల వ్యవధిలో ఆ ప్రాంతం శవాల గుట్టలుగా మారింది. ఆ రెండు గంటల ముందు కనిపించిన గ్రామాలన్ని ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఊళ్లు లేవు, ఊళ్లలో జనాలు లేరు. వర్షం భీకరంగా కురుస్తుండడంతో గ్రామంలోని ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు కొమ్మలు, ప్రార్థన మందిరాలు, ఆలయాల్లో తలదాచుకున్నారు. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో గ్రామాల్లోని ఇళ్లు నీటిలో కొట్టుకుపోవడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

పశువులు సైతం నీటిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. ఈ విలయంలో ప్రాణాలు కోల్పోయిన అనేకమందికి స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల నాయకులు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆశ్రయం కోల్పోయిన వారికి పోలీసులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉప్పెన కారణంగా వందలాది గ్రామాలు కొట్టుకుపోవడంతో పాటు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ ఉప్పెనలో సుమారు పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు అంచనా వేశారు. రెండున్నర లక్షల పశువులు మరణించాయి. దివిసీమ ఉప్పెన తర్వాత స్థానికుడైన అప్పటి మంత్రి మండలి వెంకట కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వ యంత్రాగం కదిలింది. గ్రామల్లోని ప్రజలను ఆదుకునేందుకు అనేకమంది ముందుకు వచ్చారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దివిసీమ ప్రాంతానికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు.

 

 

Like Our Facebook Page – Chudu Babai

అంతర్యుద్ధంతో పాకిస్తాన్ పతనం మొదలవుతుందా? – Read Here

 1,147 Total Views,  1 Total Views Today

Comment Your Views
Spread the love