అంతర్యుద్ధంతో పాకిస్తాన్ పతనం మొదలవుతుందా?

పాకిస్తాన్ లో అంతర్యుద్ధం

సిరియా అంతర్యుద్ధం.. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడడంతో సైనికుల సాయంతో ఆందోళనలను అణచివేయాలని చూడడంతో అక్కడి ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగాయి. దీంతో సిరియాలో కొన్ని వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి పాకిస్తాన్ లో కనిపిస్తోంది. దేశ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుండడంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం సైతం సైన్యాన్ని ఉపయోగిస్తోంది.
పాకిస్తాన్‎లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగినా.. పెత్తనం మొత్తం సైన్యం చేతిలోనే ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా ఏళ్ల పాటు సైన్యం పెత్తనంలోనే ఉంది. పాకిస్తాన్ ప్రధానులు చాలా మంది ఈ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని ఇమ్రాన్ ఖాన్ కొనసాగిస్తున్నారు.

సైనిక దళాల ఛీఫ్ లు పాలకులు కావడం, వారే ఏళ్ల తరబడి పాలన పేరుతో ప్రజలను అణచివేయడంతో ప్రజల్లో నిరసనలు మొదలయ్యేవి.. కానీ కొన్ని రోజులకే.. ఈ ఆందోళలు ముగిసిపోయేవి. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్ లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. ప్రభుత్వంపై సైన్యం పెత్తనం వద్దంటూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం చర్యలకు దిగింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, దేశ మాజీ అధ్యక్షుడు జర్దారీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే జర్దారీపై అవినీతి కేసుల్లో నేరారోపణలు ఖరారు అయ్యాయి.. నవాజ్ షరీఫ్ పై పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో సైన్యం జోక్యం చేసుకుంటోంది అంటూ నవాజ్ షరీఫ్ ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ రాజ్యంగం ప్రకారం న్యాయవ్యవస్థ, సైన్యంపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం నేరం. 2018 ఎన్నికల్లో సైన్యం రిగ్గింగ్ చేయడం వల్లే ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం షరీఫ్ పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నేరం రుజువైతే ఉరిశిక్ష పడే అవకాశం ఉంది.

2008 వరకు ప్రభుత్వంలో సైన్యం పాత్ర అధికంగా ఉండేది. ఆ తర్వాత సైన్యం వెనక్కు తగ్గింది. 2008లో పౌర ప్రభుత్వాన్ని సజావుగా సాగనిచ్చింది. ఇక 2013లో అధికారంలోకి వచ్చిన నవాజ్ షరీఫ్ సైతం ఐదేళ్లు పాలించారు. 2018లో నవాజ్ షరీఫ్ ను ఓడించి అధికారం చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ వెనుక సైన్యం చేరింది. ఇమ్రాన్ నవాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన ఉద్యమంలోనూ సైన్యం కీలక పాత్ర పోషించింది.
సైన్యం వెనక ఉండి నడిపిస్తున్న ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రతిపక్షాలు పూనుకున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజల్ని పెద్దఎత్తున కూడగట్టి డిసెంబర్ వరకు భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించాయి. కానీ ప్రభుత్వం, ఆర్మీ వీరిని అణచివేయాలని భావిస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా ఉన్న నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్ ను అరెస్ట్ చేసేందుకు కరాచీ పోలీస్ చీఫ్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో పోలీస్ చీఫ్ ను ఆర్మీ కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ప్రభుత్వంపై ప్రజలు ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఇమ్రాన్ ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉంది. జీతాలు చెల్లింపులకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో ప్రజాందోళనలు ఉధృతమైతే కట్టడి చేయలేమని భావించిన ఇమ్రాన్ కఠిన చర్యలు అమలు చేయాలని భావిస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది అంటూ మరోసారి లాక్డౌన్ అమలు చేయాలని యోచిస్తోంది. దీని వల్ల ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చని, పూర్తిగా ఉద్యమాన్ని కంట్రోల్ చేయవచ్చని ఇమ్రాన్ ప్రభుత్వం, ఆర్మీ డిసైడైంది.

దీనికి తోడు గత నెలలో లాహోర్ హైవేపై కారులో వెళ్తున్న మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తన ముగ్గురు పిల్లలతో ప్రయాణిస్తున్న సమయంలో కారులో ఆయిల్ అయిపోవడంతో లాహోర్ శివార్లలో ఆగిన ఆమెపై తుపాకీలతో బెదిరించి పిల్లల ఎదురుగానే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రజానీకంలో ఆగ్రహం తెప్పించింది. లాహోర్లో మహిళలు రోడ్లపైకి వచ్చి బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై లాహోర్ పోలీస్ అధికారి ఉమర్ షేక్ బాధితురాలు రాత్రి సమయంలో బయటకు ఎందుకొచ్చింది? వచ్చినా ఆ రూట్లో వెళ్లవల్సింది కాదు అంటూ బాధితురాలిది తప్పు అన్నట్టు వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉమర్ పై చర్యలు తీసుకుని, మహిళలకు రక్షణ కల్పించాలని దేశవ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం తమకు వద్దు అంటూ భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు.

ఓ పక్క ప్రజాందోళనలతో పాటు ఇప్పుడు ప్రతిపక్షాలన్ని ఏకమవడం, మరో వైపు ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి ఇమ్రాన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. వీటన్నింటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలీక ఇమ్రాన్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.

సోని స్మాార్ట్ ఫోన్ సేల్స్ ఎందుకు పడిపోయాయి- Read Here

Like our Facebook Page chudubabai

 1,676 Total Views,  2 Total Views Today

Comment Your Views