
మా మంచు.. ‘మా’ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ మంట పెట్టిందా.. ఎప్పుడూ ప్రశాంతంగా జరిగే ‘మా’ఎన్నికలు ఈసారి రణరంగాన్ని తలపించాయి. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన మంచు ఫ్యామిలీ ‘మా’లో చీలికలు తీసుకువస్తోందా?
‘మా’ఎలక్షన్స్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ప్యానెల్ ప్రకటించేసి.. నానా రచ్చ చేశారు. బిల్డింగ్ నిర్మాణం నుంచి ప్రాంతీయ వాదం వరకు ప్రతీ విషయాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు ఇరు ప్యానెల్ సభ్యులు. మొత్తంగా ‘మా’ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఎన్నికల రోజు ‘మా’సభ్యులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
బాగా పెరిగిన ఓటింగ్ శాతం
‘మా’ఏర్పడిన సుమారు 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ‘మా’ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించినట్టుగా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్లు రారు అని అందరూ భావించారు. కానీ పోలింగ్ రోజు అనూహ్యంగా ఎక్కడ ఉన్నా సరే చాలా మంది తమ ఓటు వేశారు. వాళ్లందరినీ రప్పించడంలో మోహన్ బాబు సఫలీకృతుడైనా.. సైలెంట్ ఓటింగ్ జరిగిందని.. అదంతా ప్రకాశ్ రాజ్ కు కలిసి వచ్చిందనే వాదన వినిపించింది. కానీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. మంచు విష్ణు ‘మా’అధ్యక్షుడిగా సుమారు 100కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలింగ్ జరిగిన సమయంలో ఇరు ప్యానెళ్లు పోలింగ్ బూత్ లో బాహాబాహికి దిగినా.. బయటకొచ్చి మాత్రం ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని ఏం జరగనట్టు ప్రవర్తించారు.
ఓటు వేసేందుకు ‘మా’సభ్యులు తరలివస్తుండడంతో ఇరు ప్యానెళ్లతో చర్చించిన ఎన్నికల అధికారి.. ఓటింగ్ టైమ్ ను మరో గంట పొడిగించారు. దీంతో ఓటింగ్ శాతం పెరగడంతో ఇరు ప్యానెళ్లు ఓట్లు తమకు పడతాయంటే తమకు పడుతున్నాయని ధీ’మా’వ్యక్తం చేశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని అందరూ భావించినా.. మధ్యాహ్నం 3.30 గంటలకే కౌంటింగ్ ప్రారంభించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్ లో ‘మా’అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందినట్టు ప్రకటించారు.
‘ మా ‘లో మంచు గెలుపు చీలిక తీసుకువస్తుందా?
మా మంచు విష్ణు గెలవడంతో వెంటనే ప్రకాశ్ రాజ్ అభినందనలు తెలిపారు. ప్రకాశ్ రాజ్ ‘మా’ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పగానే ముందుగా బయటకొచ్చి సపోర్ట్ చేస్తానని చెప్పిన నాగబాబు విష్ణు గెలుపుపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ‘మా’ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ వివాదాన్ని తీసుకొచ్చి మంచు విష్ణు అందర్నీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో మంచు విష్ణు సఫలీకృతులయ్యారు. తాను సపోర్ట్ చేసిన ప్రకాశ్ రాజ్ గెలవకపోవడం… ‘మా’లో ప్రాంతీయవాదాన్ని తీసుకురావడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నాగబాబు ‘మా’సభ్యత్వానికి రాజీనా’మా’చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక ఫలితాలు వెల్లడైన తర్వాత మీడియా ముందుకు వచ్చిన ప్రకాశ్ రాజ్ ‘మా’పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా’ఎన్నికల్లో ప్రాంతీయవాదం, జాతీయవాదం తీసుకురావడాన్ని ఆయన ఖండించారు. అలాంటి ‘మా’లో తాను ఉండనంటూ ‘మా’సభ్యత్వానికి రాజీనా’మా’చేశారు. తాను తెలుగు వాడిగా పుట్టకపోవడం తన దురదృష్టకరమని.. ‘మా’కు తెలుగువాడే అధ్యక్షుడిగా ఉండాలని సభ్యులు నిర్ణయించారని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మాత్రమే రాజీనా’మా’చేస్తున్నానని.. తెలుగు సినిమాలకు దూరం కానని స్పష్టం చేశారు.
‘ మా ’పోలింగ్ లో ట్రెండ్ ఎలా ఉంది..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మొత్తం 900 మంది సభ్యులుండగా.. 883 మందికి ఓటు హక్కు ఉంది. 635 మంది ఓటేశారు. 52 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన మంచు విష్ణుకు 381 ఓట్లు లభించగా, ప్రకాష్ రాజ్‌కు 274 ఓట్లు లభించాయి. 100కు పైగా ఓట్లతో ప్రకాశ్ రాజ్ పై విష్ణు గెలుపొందారు. అయితే తెలుగు వాళ్లే ‘మా’ప్రెసిడెంట్ గా ఉండాలని.. ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన విష్ణు మద్దతుదారులు ఎట్టకేలకు విష్ణు గెలుపొందేలా కృషి చేశారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. విష్ణుకు.. ప్రకాశ్ రాజ్ కు 107 ఓట్లు తేడా ఉంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 52 ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటన్ని గంపగుత్తగా మంచు విష్ణుకే పడ్డాయని భావించవచ్చు. ఎందుకంటే ముందు నుంచి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రకాశ్ రాజ్ వ్యతిరేకించడం.. సిని’మా’పెద్దలకు మోహన్ బాబు ఫోన్ చేసి మద్దతు కూడగట్టడం.. పోస్టల్ బ్యాలెట్ కోసం కట్టాల్సిన డబ్బులను విష్ణు కట్టడం లాంటి పనులు చేశారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మంచు విష్ణుకు పడినట్టు భావించవచ్చు.
ఇక అందులో మిగిలిన ఓట్లు మరో 57. ఇవన్నీ బయటనుంచి వచ్చి ఓటేసిన వాళ్లు.. ప్రకాశ్ రాజ్ ను వ్యతిరేకించిన వారి ఓట్లుగా భావించవచ్చు. ‘మా’లో సభ్యత్వం ఉన్న జెనిలీయా ముంబైలో ఉంటోంది.. వచ్చి ఓటు వేస్తుందా అంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. అయితే మంచు విష్ణుతో ఫ్రెండ్షిప్ ఉన్న జెనీలియా ముంబై నుంచి వచ్చి ఓటు వేసి.. మళ్లీ వెంటనే తిరిగి వెళ్లిపోయింది. ఇక జయప్రద, మాలశ్రీ లాంటి సీనియర్ నటులు సైతం మోహన్ బాబు మాట మన్నించి వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఇలాంటి ఓట్లన్నీ మంచు విష్ణుకే పడినట్టు భావించినట్టు. ఈసారి పెరిగిన ఓటింగ్ మొత్తం మోహన్ బాబు, మంచు విష్ణు కారణంగానే.. ఆ ఓట్లన్నీ వాళ్లు సొంతం చేసుకున్నారు. గతంతో పోలిస్తే.. ఈ ఏడాది ఓటింగ్ పెరిగింది. పెరిగిన ఓటింగ్ ను సొంతం చేసుకోవడంతో మంచు విష్ణు గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ లేకపోయినా.. గతంలో మాదిరిగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఓటింగ్ కు దూరంగా ఉంటే.. విష్ణు.. ప్రకాశ్ రాజ్ మధ్య పోటీ చాలా టైట్ గా ఉండేది.
ఎలక్షన్ మేనేజ్‌మెంట్ లో మంచు ఫ్యామిలీ విజయవంతమైంది. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లని తీసుకొచ్చి మరీ విష్ణుకు ఓట్లు పడేలా చేసుకున్నారు. అయితే ముందు నుంచి విష్ణు తీరును ఎండగడుతూ వస్తున్న ప్రకాశ్ రాజ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ చేసుకోలేకపోయారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో ప్రకాశ్ రాజ్ గెలుస్తారు.. అని అందరూ భావించారు. మంచు విష్ణుపై వ్యాఖ్యలు చేయడం మినహా ప్రకాశ్ రాజ్ ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యారు. విఫలమయ్యారు అని చెప్పే అవకాశం కూడా లేదు.. ఎందుకంటే కొత్త ఓట్లు మినహాయిస్తే,.. ప్రకాశ్ రాజ్ కూడా 250కి పైగా ఓట్లు సంపాదించారు.
ప్రాంతీయ వాదం, తెలుగువాడు మాత్రమే అధ్యక్షుడిగా ఉండాలని మంచు ఫ్యామిలీ చేసిన నినాదం ప్రకాశ్ రాజ్ కు పడిన ఓట్లు చూస్తే విజయవంతమైందని భావించనవసరం లేదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్, ఇతర ప్రాంతాల వాళ్ల ఓట్లు తీసేస్తే.. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుకు వచ్చిన ఓట్లు సమానంగా భావించాలి. కొత్త ఓట్లను కూడగట్టడంలో మంచు విష్ణు సఫలమయ్యారు.. తప్ప ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చి గెలిచారు అని భావించనవసరం లేదు. ‘మా’అధ్యక్షుడిగా తెలుగు వాడే ఉండాలి అన్నప్పుడు ‘మా’లో అన్ని తెలుగు వారి ఓట్లే ఉండాలి.. అధ్యక్షుడిగా బయటవాళ్లు ఉండకూడదు తప్ప.. బయటవారి ఓట్లు మాత్రం తెలుగువాడికి పడాలి. ఈ లాజిక్ ను ‘మా’సభ్యులు అర్ధం చేసుకున్నారో.. లేదో తెలియదు కానీ.. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చిన విష్ణుకు పట్టం కట్టారు.
‘ మా ‘ కు రాజకీయ రంగు
అయితే ‘మా’ఎన్నికలను రాజకీయం చేశారు పలువురు ‘మా’సభ్యులు. ‘మా’అధ్యక్షుడిగా పోటీ చేసి మధ్యలో ‘మా’సభ్యత్వానికి రాజీనా’మా’చేసిన సీవీఎల్ నర్సింహారావు.. మాలోకి రాజకీయాలను తీసుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ పై కీలక వ్యాఖ్యలు చేసి.. అప్పటిదాకా ప్రాంతీయవాదంతో కొట్టుకుంటున్న ‘మా’లో జాతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇది వివాదంగా మారడంతో సైలెంట్ గా నామినేషన్ ను వెనక్కి తీసుకుని అటు మాకు ఇటు బీజేపీకి రాజీనా’మా’చేసి సైలెంట్ అయిపోయారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు.
మొత్తంగా ‘మా’అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందడం ‘మా’లో చీలికలకు దారి తీస్తుందా అనే వాదన మొదలైంది. ఇప్పటికే ‘మా’అధ్యక్ష పదవి కోసం మంచు ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నించి.. సక్సెస్ అయ్యింది. ‘మా’అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందినా.. వెనుక ఉండి చక్రం తిప్పేది అంతా మోహన్ బాబేనని చర్చ జరుగుతోంది. పోలింగ్ సమయంలోనూ.. కౌంటింగ్ సమయంలోనూ మోహన్ బాబు చేసిన హడావుడి చూస్తే.. నిజమనే భావించాలి. సినీ ఇండస్ట్రీ పెద్దగా మోహన్ బాబు కౌంటింగ్ కేంద్రంలో ఇతర ప్యానెల్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పలు వార్తలు వచ్చాయి.
మొత్తంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను “మా మంచు” టీమ్ గా మార్చుకున్నారు. మంచు విష్ణు గెలుపొందడం.. ముందుగా నాగబాబు రాజీనా’మా’చేయడం.. ఆ కొద్దిసేపటికే ఇలాంటి చోట నేనుండలేను అంటూ ప్రకాశ్ రాజ్ బయటకొచ్చేయడం చూస్తుంటే.. ఎప్పుడూ ప్రశాంతంగా జరిగే ‘మా’ఎలక్షన్స్ లో రాజకీయం తీసుకొచ్చిన చోట మనకెందుకు అని భావించి చాలా మంది ‘మా’కు రాజీనా’మా’చేస్తారని తెలుస్తోంది. వీరిద్దరి బాటలో మరికొంతమంది బయటకొచ్చేస్తే.. ‘మా’లో చీలికలు తప్పవు..
Like Our Facebook Page ChuduBabai
Read our Thriler story Akankasha Episode 6
1,463 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022