మనకెందుకొచ్చిన ‘మా’

మా ఎలక్షన్స్
మా ఎలక్షన్స్

మా ఎలక్షన్స్ ఎందుకింత వివాదాస్పదమవుతున్నాయి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు పెద్ద దిక్కు లేకపోవడమే ఇలాంటి వివాదాలకు కారణమవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. గతంలో మా అధ్యక్షులుగా చేసిన సీనియర్ నటీనటులు ఇప్పుడు మా ఎలక్షన్స్‌ కు ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఈ గొడవలన్నీ మనకెందుకు అనుకుంటున్నారా? ఇంత మంది అధ్యక్షులుగా పని చేసినా.. భవన నిర్మాణం ఎందుకు జరగడం లేదు?

మా ఎలక్షన్స్ ఎందుకంత వివాదం?

మా ఎలక్షన్స్ ఇప్పుడు.. సాధారణ ఎన్నికలను మించిపోతున్నాయి. తెలంగాణలో మంచి కాక రేపుతున్న హుజురాబాద్ ఎన్నికల కంటే మా ఎలక్షన్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈటల వర్సెస్ కేసీఆర్ గా మారిన హుజురాబాద్ కన్నా.. మంచు వర్సెస్ ప్రకాశ్ రాజ్ ఇప్పుడు మీడియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ హైలెట్ అవుతోంది. ఇంకా ప్రస్తుత కమిటీ పూర్తవక ముందు నుంచే సుమారు మూడు నెలల నుంచి మా ఎన్నికల హడావుడి మొదలైంది. మా ప్యానెల్ అంటే.. ఇదిగో మా ప్యానెల్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఓకే మనకి కూడా ఒక హాట్ టాపిక్ దొరికింది కదా అని మీడియా అనుకుంటే మా ఎన్నికలంటే.. మా ఎలక్షన్స్ మాత్రమే మీడియా జోక్యం ఎందుకంటూ కొంతమంది ప్రశ్నించారు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులే ప్రెస్ మీట్లు పెట్టి పక్క ప్యానెల్ వాళ్లని కడిగేస్తున్నారు.

గతంలో ఏం జరిగింది?

అయితే ఇదంతా ప్రస్తుతం.. ఒకసారి గతాన్ని తవ్వి చూస్తే.. ఎప్పుడూ కూడా మా ఎలక్షన్స్ ఇంత వివాదాస్పదం అవ్వలేదు. మా ఎన్నికలంటే.. పోలింగ్ రోజు తప్ప మీడియా కవరేజ్ కూడా ఉండేది కాదు. చాలా హుందాగా మా ఎలక్షన్స్ నిర్వహించే వారు. దాసరి నారాయణ రావు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్,జయసుధ లాంటి సీనియర్లు ఎందరో మా అధ్యక్షులుగా పని చేశారు. అంతే హుందాగా తప్పుకున్నారు. కానీ గత రెండు టెర్ములుగా మా ఎలక్షన్స్, మా కమిటీ వివాదాస్పదం అవుతోంది. మా భవనం చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. భవనాన్ని కట్టే స్తోమత మాకుందంటే మాకుంది అంటూ అధ్యక్షులుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

గతసారి జరిగిన మా ఎన్నికల్లో మొదలైన రచ్చ ఇప్పటికీ నడుస్తోంది. నరేశ్, శివాజీ రాజా గతసారి ఎన్నికల బరిలోకి దిగారు. నరేశ్ ప్యానెల్ పై శివాజీ రాజా బ్యాచ్ ఆరోపణలు చేశారు. ఇక జీవితా, రాజశేఖర్ అయితే స్టేజీపైనే సినీ పెద్దలను అవమానించి నానా హంగామా చేశారు. మా అసోసియేషన్ లెక్కలపైనా నరేశ్ ప్యానెల్ పై బహిరంగంగా కామెంట్స్ వచ్చాయి.

లోకల్ నాన్ లోకల్ వివాదం

ఈసారి మా ఎన్నికల టెర్మ్ ముగియకుండానే కొత్త ప్యానెల్స్ వివాదం మొదలుపెట్టాయి. మా ఎలక్షన్స్ త్వరగా నిర్వహించాలంటూ డిసిప్లీనరి కమిటీకి లేఖలూ రాశారు. మూడు నెలల ముందే ప్యానెల్ సిద్ధం చేసుకుని రచ్చ చేయడం ప్రారంభించారు. ఇక ఈసారి మా ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్ నిలబడుతున్నట్టు ప్రకటించగానే.. ఆపోజిట్ గా ఎవరైనా సీనియర్ నటులు పోటీ చేస్తారని అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. మంచు ఫ్యామిలీ నుంచి నటుడు, నిర్మాత మంచు విష్ణు తాను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఓ పక్క ప్రకాశ్ రాజ్ పోటీకి సై అనడంతో మెగా బ్రదర్ నాగబాబు మద్దతు పలికారు. ప్రకాశ్ రాజ్ కు మెగా సపోర్ట్ ఉండడంతో నాన్ లోకల్ కార్డ్ ను తెరపైకి తీసుకొచ్చారు.

నటులకు లోకల్ నాన్ లోకల్ ఉండదంటూ ప్రకాశ్ రాజ్ మద్దతుదారులు వెనకేసుకొచ్చారు. ఎట్టకేలకు మద్దతు కూడగట్టుకున్న ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను సిద్ధం చేసుకున్నారు. ఒకానొక సమయంలో సినీ పెద్దలు ముందుకు వస్తే.. ఏకగ్రీవానికి తాను సిద్ధంగా ఉన్నట్టు మంచు విష్ణు ప్రకటించి షాక్ ఇచ్చారు. మా భవనాన్ని పూర్తిగా తమ సొంత నిధులతో నిర్మిస్తామని భారీ ఆఫర్ ఇచ్చారు. దీనిపై సినీ పెద్దలెవరూ స్పందించలేదు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రకటించిన కొద్ది రోజులకే మంచు విష్ణు తన ప్యానెల్ సిద్ధం చేసుకున్నారు. మంచు విష్ణుకు ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్న నరేశ్ మద్దతు పలికారు. నిన్ను నడిపించడానికి నేనున్నా అంటూ విష్ణు వెంటే ఉంటున్నారు. గతంలో నరేశ్ ప్యానెల్ లో ఉన్న జీవిత ఈసారి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి.. మళ్లీ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు జంప్ అయ్యారు. ఇక మరో నటుడు సీవీఎల్ నర్సింహారావు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానని నామినేషన్ దాఖలు చేసి.. రాజకీయాలను రంగంలోకి దింపారు. వ్యక్తిగతంగా బీజేపీ నాయకుడైన సీవీఎల్ ఏకంగా బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రకాశ్ రాజ్ పై కామెంట్లు చేశారు. ప్రకాశ్ రాజ్ కర్ణాటకలో ఓడిపోయారని.. దేశవ్యతిరేకి అంటూ కీలక వ్యాఖ్యలు చేసి.. నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు.

రాజకీయ రంగు పులుముకున్న ‘మా’

ప్రస్తుతం బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. హుజురాబాద్ బరిలో ఉన్న ప్రత్యర్ధులు కూడా తిట్టుకోనంత స్థాయిలో వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మంచు విష్ణు ఒకడుగు ముందుకు వేసి.. నేనేంటో ప్రజలకు తెలుసు అంటూ రోజుకొక ఛానెల్ చుట్టేస్తున్నారు. అసలు మా ఎలక్షన్స్ కు ప్రజలకు సంబంధమేంటో మంచు విష్ణు ప్రకటించాల్సి ఉంటుంది. ప్రజలు వచ్చి ఓటు వేస్తారా.. లేక ఆ అసోసియేషన్ సభ్యులు ఓటు వేస్తారో ఎలక్షన్ లో నుంచున్న మంచు విష్ణుకు తెలీదా.. నాకు కేటీఆర్ తెలుసు, జగన్ నా బావ, మోడీ ఇంటికి వెళ్లా అంటూ మంచు విష్ణు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్నా.. చివరికి ఓటు వేయాల్సింది మా సభ్యులు మాత్రమే ఆ విషయం విష్ణు గమనించడం లేదేమోననే అనుమానం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే తాను డోర్ టు డోర్ క్యాంపైన్ పూర్తి చేసినట్టు విష్ణు ప్రకటించారు. మహా అయితే మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేది 500 మంది ఉండొచ్చు. దానికి డోర్ టు డోర్ క్యాంపైన్ ఏంటో.. ప్రతీ వాళ్లకి ఫోన్ చేసి ఓటు అడగడం చూస్తుంటే కొంత వింతగా కనిపిస్తోంది. మా అధ్యక్షుడిగా కన్నా.. సినీ ఇండస్ట్రీకి తాను పెద్ద దిక్కుగా ఉండాలని మంచు విష్ణు భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎక్కడైనా మాట్లాడితే నాన్న గారికంటే గొప్పా అంటూ మాట్లాడుతున్నా మంచు విష్ణు. ఇదంతా చూస్తుంటే మోహన్ బాబును సినీ ఇండస్ట్రీ పెద్దగా చూపించాలని భావిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.

సాధారణ ఎన్నికల మాదిరిగానే ప్రలోభాల పర్వం మా ఎన్నికల్లోనూ మొదలైందనే వాదన వినిపిస్తోంది. మా సభ్యులకు పార్టీలు, డబ్బు పంపిణీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకడుగు ముందుకు వేసిన మంచు విష్ణు ప్యానెల్ కు చెందిన పృధ్వీ రాజ్ ఏకంగా సభ్యులను బెదిరించారని ఓ ఆడియో వైరల్ అవుతోంది. ప్రకాశ్ రాజ్ కు సన్మానం ఎందుకు చేశారంటూ పృధ్వీ నిలదీశారు. ఇక తన ఫోటోలు మార్ఫింగ్ చేశారంటూ హేమ… కరాటే కళ్యాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు, దూషణలే కాక మా వివాదం పోలీసుల వరకు చేరింది.

పెద్దలెందుకు నోరు విప్పడం లేదు?

మా ఎలక్షన్స్ చుట్టూ ఇంత వివాదం జరుగుతున్నా సినీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదనే వాదన మొదలైంది. సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండే దాసరి నారాయణ రావు మరణించాకా.. మా మసకబారిపోయిందనేది నగ్న సత్యం. గతంలో ఎలాంటి వివాదమున్నా.. నలుగురిలో చర్చించుకుని నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు చర్చ కాదు కదా.. రచ్చ రచ్చ చేస్తున్నారు. అయిన ఇండస్ట్రీలో పెద్దలు పెదవి విప్పడం లేదు. కనీసం ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా కొంతమంది ముందుకు రాకపోవడం గమనార్హం. పెద్దలైన కృష్ణ, మురళీ మోహన్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ నటులు కనీసం ఎన్నికలపై స్పందించడం లేదు. ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో అసలు వీళ్లు వచ్చి ఓటేస్తారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది,.

Like our Facebook page Chudubabai

Most Viewed Story on Our Chudubabai Tholiprema

 1,612 Total Views,  2 Total Views Today

Comment Your Views