ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు.. గొప్పోడు.. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ.. ఎమ్మెస్ నారాయణ చెప్పే డైలాగ్.. అది రీల్.. కానీ రియల్‌గా ఆ డైలాగ్ పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి కి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అవును తనను మెగాస్టార్ చేసిన సినిమా ఇండస్ట్రీ కోసం తనను తాను తగ్గించుకున్నారు. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించారు. అనుకున్నది సాధించారు.
ఇండస్ట్రీని ఏకతాటిపైకి తెచ్చిన చిరంజీవి
సినిమా ఇండస్ట్రీ ఏపీలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి ఎన్నోసార్లు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లారు. మాజీ కేంద్ర మంత్రి, పద్మ భూషన్ అవార్డు గ్రహిత, ఒక మెగాస్టార్.. సినిమా ఇండస్ట్రీలో పెద్దగా వెలుగొందుతున్న వ్యక్తి అయినా చాలా నెమ్మదిగా సౌమ్యుడిగా ఉండడం ఆయనకే చెల్లింది. సీఎం జగన్‌తో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేసి.. ఇండస్ట్రీని ఏకతాటిపైకి తీసుకొచ్చి.. వారందరినీ వెంటబెట్టుకుని వెళ్లి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు విన్నవించారు.
సినిమా టికెట్ ధరలు తగ్గించినా.. ఐదు షోలకు అనుమతి ఇవ్వకపోయినా చిరంజీవికి వచ్చే నష్టం ఏం లేదు. ఆయన నటిస్తే.. టికెట్ రేటు ఎంతైనా తెలుగు ప్రజానికం థియేటర్లకు క్యూ కడుతుంది. కానీ నిర్మాతలు నష్టపోకూడదు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల త్వరలో విడుదలయ్యే భారీ బడ్జెట్ నష్టపోకూడదని ఆయన భావించారు. తనను పెద్ద చేసి.. మెగాస్టార్‌ను చేసిన ఇండస్ట్రీ గురించి మాత్రమే ఆలోచించారు. ఇప్పటికే కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ఎంతో కోల్పోయింది. విడుదలకు రెడీ అయినా.. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోతే.. నష్టపోతామనే భావనతో పెద్ద సినిమాలు రిలీజ్‌లను వాయిదా వేసుకున్నాయి.
కరోనా తగ్గుముఖం పట్టింది. సినిమాల జాతర మొదలైంది అనుకునే తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించేసింది. సామాన్యులకు సినిమా అందుబాటులో ఉండేందుకు నిర్ణయం అంటూ ప్రకటించారు. గతంలో ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించిన దాసరి నారాయణరావు లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి కంకణం కట్టుకున్నారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం
మెగాస్టార్ ట్యాగ్‌ను పక్కన పెట్టేశారు. ఒక సినీ నటుడిగా సీఎం ముందుకు వెళ్లారు. తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇక తాజాగా సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరితో చిరంజీవి బృందం సీఎం జగన్‌తో భేటీ అయ్యింది. ఎక్కువగా సీఎం జగన్ మాట్లాడిన వీడియోలు వెంటనే విడుదల చేయరు. ఆయన మాట్లాడిన అనంతరం వాటిని ఎడిట్ చేస్తారనేది జగమెరిగిన సత్యం.
తాజాగా ఇప్పుడు అలానే ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది. సీఎంతో మీటింగ్ అనంతరం సినీ ప్రముఖులు బయటకు వచ్చి మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన వారందరూ.. ప్రభుత్వానికన్నా ముందు చిరంజీవికే ఎక్కువగా ధన్యవాదాలు చెప్పారు. దీని గురించి తర్వాత చెప్పుకుందాం.. అయితే ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో.. ఇండస్ట్రీ వైపు చల్లని చూపు ఉండాలని.. చేతులు జోడించి అడుగుతున్నా అంటూ చిరంజీవి మాట్లాడినట్టు స్పష్టంగా ఉంది.
ఎలాగా ఎడిట్ చేశారు కాబట్టి… చిరంజీవి తగ్గి మాట్లాడిన వీడియోను కట్ చేస్తే సరిపోయేది. కానీ ఎందుకు అలా చేశారో ఎవరికీ తెలీదు.. కానీ ప్రభుత్వం విడుదల చేసిన ఒక్క వీడియోతో చిరంజీవి ఎలాంటి వారు అనేది ప్రపంచానికి తెలిసింది. ఇప్పటి వరకు చిరంజీవి యాంటీ ఫ్యాన్స్‌లో ఆయనపై ఒక ముద్ర ఉంది.. కానీ ఈ వీడియోతో అందరిలో ఆయనంటే ఏంటో బయటపడింది.
ఇండస్ట్రీ పెద్ద చిరంజీవినే అని చెప్పేందుకు ఈ ఒక్క వీడియో ఉదాహరణగా చాలు. ఒక కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చేతులు జోడించి అడుగుతున్నా.. అంటే అక్కడ ఆయన ఎంత హుందాగా ప్రవర్తించారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు.. సర్ మేము ఇలా ఇబ్బందులు పడుతున్నాం.. మాకు ఇలా చేయండి అంటే సరిపోతుంది.. కానీ ఆయన తన స్థాయిని పక్కన పెట్టి హుందాగా ప్రవర్తించారు.
ఇక సీఎంతో భేటీ అనంతరం మీటింగ్‌కు హాజరైన ప్రతీ ఒక్కరు వచ్చి.. సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన చిరంజీవికే ఎక్కువగా ధన్యవాదాలు చెప్పారు. ఇక రాజమౌళి అయితే ఒక అడుగు ముందుకు వేసి చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దను చేసేశారు. నిజానికి రాజమౌళి చెప్పినట్టు చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగానే వ్యవహరించారు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీ ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా భారీ దెబ్బే.. ఇలాంటి సమయంలో ఎవరికీ వారు.. ఇండస్ట్రీకి సంబంధించిన వారు.. సంబంధించని వారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పేర్ని నాని అన్నట్టు. అంతకు ముందు చిరంజీవి ఒంటరిగా వెళ్లి సీఎం జగన్‌ను కలిశారు. అప్పుడు అలాంటి విమర్శలే వచ్చాయి. పర్సనల్ మీటింగ్ అని మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్పారు. కానీ ఈసారి చిరంజీవి ఎలాంటి అపవాదు లేకుండా.. సీఎం నుంచి పిలుపు వచ్చింది. ఎవరెవరు వస్తున్నారో నాకు తెలియదంటూ అందరితో కలిసి మీటింగ్‌కు వెళ్లారు.
అందరితో కలిసి సినీ సమస్యలపై చర్చించారు. చీకటిలో మగ్గుతున్న సినిమాకు వెండితెర వెలుగులను పంచారు. చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్వ వైభవం రానుంది. మళ్లీ థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడనున్నాయి. సినీ కార్మికులకు సైతం కడుపునిండే పాతరోజులు తిరిగిరానున్నాయి. ఇండస్ట్రీ కోసం చిరంజీవి తనను తాను తగ్గించుకున్నా.. ప్రజల మనస్సుల్లో మహోన్నత వ్యక్తిగా మిగిలిపోతారు.
Read Our Article on AP Airports Issue Click Here
Like Our Facebook Page ChuduBabai
1,623 Total Views, 3 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022
1 Response
[…] Read Our Special Article on Megastar Chiranjeevi Click here […]