
హైదరాబాద్ ను కరోనా మహమ్మారి కమ్మేస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడమే కాకుండా మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు కేవలం పదుల సంఖ్యలో కేసులు నమోదైతే ఇప్పుడు రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజుల్లోనే వందల్లో మరణాలు సంభవించడంతో హైదరాబాద్ వాసులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ లో తొలి కరోనా కేసు నమోదైన సమయంలో తెలంగాణ వ్యాప్తంగా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కరీంనగర్ కు వచ్చిన ఇండోనేషియా వారి కారణంగా అక్కడ కేసులు నమోదైన సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో అప్పట్లో కరోనాను కట్టడి చేయగలరు అని అందరు ఊహించారు. అనుకోని క్రమంలో ఒక్కసారిగా ఇప్పుడు కరోనా కేసులు తెలంగాణాను చుట్టుముట్టాయి. జిల్లాల్లో కేసులు తక్కువగానే ఉన్నా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు బయటకురావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో విధించిన లాక్ డౌన్ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కాంటాక్టులకు వచ్చిన వైరస్.. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడు పల్లెల్లోను విస్తరిస్తోంది.
లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాలకు ఆదాయం లేకపోవడంతో కేంద్రం సడలింపులనిస్తూ క్రమక్రమంగా లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. కేవలం ఒక్కరోజే లక్ష కేసులు నమోదైన పరిస్థితి ఏర్పడింది. కరోనా కేసుల స్థానంలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఏకంగా 3వ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ భారత్ లోకి వచ్చిన సమయంలో అడ్డుకుంటాం అని చెప్పిన ప్రభుత్వం దానికి ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడం.. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడడం, ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో సడలింపులను ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక తెలంగాణలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. హైకోర్టు సైతం ఆదేశాలు ఇచ్చింది. కరోనా నుంచి రోగులను కాపాడే వైద్యులు సైతం ఈ వైరస్ బారిన పడుతుండడం, లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, జర్నలిస్టులకు కరోనా సోకడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రజలే వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప.. ప్రభుత్వాలు చేసేదేమి లేదని తేలిపోయింది. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మినహా ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు చేసేదేమి లేదు.
జిహెచ్ఎంసీ పరిధిలోనే వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీలు, పలు ఎమ్ఎన్సీలు ఉండడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు మాత్రమే కాకుండా.. ఇతర దేశాలకు చెందిన వారు ఇక్కడ కంపెనీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో పలు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లాక్ డౌన్ ఎత్తివేయడం, అంతరాష్ట్ర రవాణాకు అనుమతి లభించడంతో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ కు వస్తుండడం అక్కడ కేసుల పెరుగుదలకు ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో కేసులు తగ్గుముఖం పట్టేవరకు అక్కడ మరిన్ని ఆంక్షలు విధించాలని.. ఆఫీసులు సైతం తమ ఉద్యోగులకు మరికొన్ని రోజులు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరుతున్నారు.
Like our Facebook page Chudubabai
Read about our new article Is PUBG a chinese Game app
2,106 Total Views, 1 Total Views Today
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022