గణేశా.. పండుగ ఏర్పాట్లు కమ్మేశారయ్యా..

గణేశా… పండుగ ఏర్పాట్లు కుమ్మేశారు. కరోనా కదా అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను నిర్వహించుకోండి

గణేశా
గణేశా

 పోటాపోటీగా పెద్ద పెద్ద విగ్రహాలు, అంగరంగ వైభవంగా ఉత్సవాలు.. హిందువులకు ఎన్నో పండగలు ఉన్నప్పటికీ చిన్నా పెద్దా మాత్రం ఎదురు చూసేది వినాయక చవితి కోసమే..  కరోనా కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు అనుమతులు లభించలేదు. వినాయక చవితి ఏర్పాట్లపై గణనాథుడి వాహనమైన మూషికం వినాయకుడికి వివరిస్తున్నట్టు చిన్న ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నం ఎవరిని కించపరిచేందుకు కాదు. మన్నించగలరు.

Lord Vinayaka- మూషికా ఎక్కడున్నావయ్యా, చాలా సేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా.. అసలు కనిపించడం లేదు. కంగారుగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఓ పరుగులు పెడుతున్నావు. ఏమైంది.

Mooshika- అన్ని తెలిసిన మీరే ఇలా అంటే ఎలా స్వామి.. వినాయక చవితి  కదా.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయా అని చూసుకోవాలి కదా..

 Lord Vinayaka- సర్ సర్లే.. నాకు తెలియని విషయం కాదా ఏంటీ.. ఇంతకీ ఏర్పాట్లు ఎలా జరిగాయి?

 Mooshika- ఎప్పటిలానే అత్యంత వైభవంగా మీ పూజలు చేసుకునేందుకు మేమంతా సిద్ధమయ్యాం స్వామి, కానీ ఒక చిన్న సమస్య వచ్చి, భూలోకంలో ఈ ఏడాది చవితి వేడుకలు ఘనంగా నిర్వహించే అవకాశం లేకపోయింది  స్వామి.

 Lord Vinayaka- ఏమైంది మూషిక, ఏ సమస్య వచ్చింది.

 Mooshika- సమస్య నాకు కాదు స్వామి, సమస్త మానవాళి ఇప్పుడు ఒక భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. కోట్లాది మంది వ్యాధితో బాధపడుతున్నారు. లక్షలాది మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

 Lord Vinayaka- అవును మూషిక విన్నాను.. అదేదో కరోనా రోగం కదా..

 Mooshika- స్వామి ఎక్కడో ఒక దేశంలో పుట్టిన ఈ వ్యాధి ఇప్పుడ భూ గ్రహం మొత్తం వ్యాపించింది. ఏమీ కాదులే అని ఏమరుపాటుగా ఉంటే చాలు ప్రాణాలు తీసేస్తోంది అట స్వామి..

 Lord Vinayaka- వ్యాధి వ్యాపిస్తోంది అని తెలిసి కూడా ఏమరపాటు ఎందుకు మూషిక ?

 Mooshika- ఎప్పుడూ ఘనంగా జరిగే వినాయక చవితి ఈ ఏడు కూడా  ఎవరింట్లో వాళ్లే చేసుకుంటున్నారు స్వామి

Lord Vinayaka- హా హా హా.. అయ్యో

 Mooshika- ఏమైంది స్వామి అలా నవ్వుతున్నారు. నేనేం అన్నానని అంత వెటకారంగా నవ్వుతున్నారు?

 Lord Vinayaka- నీ గురించి కాదు మూషిక, ఆ మనుషుల గురించి నవ్వుతున్నా

 Mooshika- వాళ్లు అన్ని బాధలు పడుతుంటే మీకు నవ్వు ఎలా వస్తోంది స్వామి?

 Lord Vinayaka- అంత అంగరంగ వైభవంగా పూజలు చేయమని నేను కోరానా? అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టమని నేను అడిగానా?

 Mooshika- అలా అంటారు ఏంటి స్వామి అది వాళ్ల భక్తి!

 Lord Vinayaka- భక్తిని కాదని నేను చెప్పానా.. కానీ భక్తి పేరుతో వాళ్ల చేసే రచ్చ అంతా ఇంతా కాదు కదా..

 Mooshika- నిజమే స్వామి..

 Lord Vinayaka- వినాయక చవితి ముందు నుంచే మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. పోనీ మండపాల దగ్గర నా పాటలు ఏమైనా పెడతారా అంటే..

 Mooshika- అదేంటి స్వామి ముందు మీ పాటలే కదా పెడుతున్నారు. మీ పాటలతో పాటు శివయ్య తండ్రి, పార్వతమ్మ పాటలు కూడా పెడుతున్నారుగా స్వామి.

 Lord Vinayaka- ఎప్పుడు పెడుతున్నారు.. నీకు తెలిదా.. నా పూజ మొదలయ్యే టైంలో భక్తి పాటలు పెడుతున్నారు. ఇక పూజ ముగిసిందంటే చాలు వాళ్ల ఇష్టం.. ఇప్పుడు పాటలు కూడా కాదు మూషిక అవేవో అరుపులు, కేకలు పెడుతున్నారు..

 Mooshika- అయ్యో స్వామి అవి అరుపులు, కేకలు కాదు స్వామి డీజే అంటారు వాటిని.. అవి కూడా ఒక రకమైన పాటలే అనుకోండి.<br>పైగా మండపంలో అడుగుపెట్టగానే జిగేల్ మనే లైటింగ్ కూడా పెడుతున్నారు. ఏ మాటకి ఆ మాట స్వామి ఆ వెలుగుల్లో మీరు మెరిసిపోతూ భలే అందంగా కనిపిస్తారు స్వామి.

 Lord Vinayaka- ఏం వెలుగులో ఏంటో.. సూర్యుని వెలుగునైనా తట్టుకోగలను ఏమో కానీ ఆ లైటింగ్ ఏంటయ్యా.. పెళ్లి మండపాల్లో పెట్టినట్టు.. కనీసం దేవుడనే భయం, భక్తి లేకుండా..

 Mooshika- అలా అనకండి స్వామి మీరంటే భక్తితోనే కదా.. వ్యయానికి కూడా వెనుకాడకుండా మీ ఉత్సవాలను అంత అద్భుతంగా చేస్తున్నారు.

 Lord Vinayaka- ఏం ఉత్సవాల్లే మూషిక, మా అమ్మ నన్ను నలుగు పిండితో తయారు చేసి ప్రాణం పోసింది. ఆ తర్వాత జరిగిన విషయం ఎలాగూ ఆ రోజు పూజ జరిగేటప్పుడు కథలో వింటావుగా.. అప్పుడు తెలుసుకో..

 Mooshika- సరే స్వామి ఏదో చెప్పబోతున్నారు.

 Lord Vinayaka- హా అక్కడికే వస్తున్నా.. అందరూ నన్ను పసుపుతో పూజించడయ్యా నేనేంతో సంతోషిస్తా అంటే వాళ్ల శక్తి కొద్ది పూజిస్తున్నారు. సర్లే అనుకున్నా.. పసుపు నుంచి మట్టి విగ్రహాలకు తీసుకువచ్చారు.

 Mooshika- మంచిదే కదా స్వామి,

 Lord Vinayaka- ఏం మంచిది మట్టితో చేసే విగ్రహాలను పక్కన పెట్టేశారు. వాటి స్థానంలో అదేదో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంట దానితో విగ్రహాలు తయారు చేసి, విషపూరితమైన రంగులు వేస్తున్నారయ్యా. ఎంత ఇబ్బందిగా ఉంటోందో తెలుసా నీకు.

 Mooshika- ఆ రంగులు మీతో పాటు నాకు కూడా పడుతున్నాయి కదా స్వామి

 Lord Vinayaka- ఇక విగ్రహాల ఏర్పాటులో కూడా పోటీ పడుతున్నారు. బ్రొటన వేలు అంత పరిమాణంలో పసుపుతో నన్ను చేసి పూజిస్తే ఎంతో సంతోషించే వాడిని కానీ, 60 నుంచి 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు. అంత ఎత్తు ఎందుకయ్యా.

 Mooshika- ఎందుకు అంటారేంటి స్వామి.. మరి మీ పూజ అంటే అసలు ఎంత హడావిడి ఉంటుంది.. మండపాలు ఏర్పాటు చేసే వాళ్ల మధ్య ఎంత పోటీ ఉంటుంది.

 Lord Vinayaka- సరే విగ్రహం ఎత్తు కూడా ఒప్పుకున్నా.. అదేంటయ్యా రకరకాల రూపాల్లో నా విగ్రహాలను తయారు చేస్తున్నారు. మా అమ్మ ఒక రూపాన్ని ఇస్తే మా తండ్రిగారు మరో రూపాన్ని ఇచ్చారు. కానీ ఈ ప్రజలేంటయ్యా.. వాళ్ల దగ్గర చలన చిత్రాల్లో వచ్చే రూపాల్లో నన్ను తయారు చేస్తున్నారు. మా అమ్మ ఎంతో ముద్దుగా బొజ్జ గణపయ్య అని పిలుచుకుంటుంది. అలాంటిది నాకు సిక్స్ ప్యాక్ పెడతారు. వీళ్లది భక్తో పిచ్చో తెలియడం లేదయ్యా..

Mooshika- అవును స్వామి, మీకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ వేషాలు కూడా వేస్తున్నారు. ఎక్కడైనా మానవులు దేవుడి వేషాలు వేస్తారు. కానీ దేవుడైన మీకు సినిమా వేషాలు వేస్తున్నారు.

 Lord Vinayaka- సత్యం పలికావయ్యా మూషిక

 Mooshika- తొమ్మిది రోజులు భూలోకంలో ఘనంగా పూజలందుకుని.. ఆ తర్వాత నిమజ్జన కోలాహలం ఎంత అద్భుతంగా ఉండేది స్వామి భూలోకాన్ని చూస్తే.

 Lord Vinayaka- బాగా గుర్తుచేశావయ్యా,, నిమజ్జనం అంటే గుర్తొచ్చింది. తొమ్మిది రోజులు పూజలు చేసి, నా విగ్రహాలను గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ సందడి ఎంత బాగుంటుదో.. కానీ మట్టి విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఎంత హాని జరుగుతోందో. ఆ నీటిలో ఉంటే జలాచరాలకు ఎంతో ప్రమాదం వాటిల్లుతోంది.

 Mooshika- ఎన్ని అనుకుంటే ఏంటి స్వామి ఈ ఏడాది సరైన పండుగ వాతావరణం కూడా లేదు కదా..

 Lord Vinayaka- నువ్వు కూడా అలా అంటే ఎలా మూషిక, నాకు పెద్ద పెద్ద మండపాలు కట్టి, ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు చేస్తేనే నాకు ఆనందమా.. ఇంట్లో తమకు తోచినట్టు చిన్న మట్టి విగ్రహం, అది కూడా లేదా.. పసుపుతో విగ్రహాన్ని చేసి పూజిస్తే చాలు. ఎలాగా పెట్టే ప్రసాదాలు ఒకటే అనుకో..

 Mooshika- స్వామి మరి నా వాటా మర్చిపోకూడదు

 Lord Vinayaka- అదేలా మర్చిపోతా… నువ్వే కదా నన్ను అందరి దగ్గరకి తీసుకెళ్లేది. చిన్న మట్టి విగ్రహం పెట్టి కుటుంబ సమేతంగా కూర్చుని భక్తితో పూజిస్తే చాలయ్యా సంతోషపడిపోతా.. ఈసారికి అలా కానిచ్చేమని చెప్పాలి.

 Mooshika- స్వామి మరి ఆ రోగం పోయే దారి లేదా..

 Lord Vinayaka- ఇందాకానే చెప్పాను కదయ్యా అది ప్రకృతి ధర్మం. ఎవరి ఖర్మ వారు అనుభవించాల్సిందే. కానీ దీనికొక మార్గం ఉందయ్యా..

 Mooshika- ఏంటో చెప్పండి స్వామి వెంటనే భూలోకానికి వెళ్లి మానవులకు చెప్పి వస్తా..

 Lord Vinayaka- నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే.. నా పూజ ఏర్పాట్లు ఎవరు చేస్తారు?

 Mooshika- ఇలా వెళ్లి అలా వచ్చేస్తా స్వామి

 Lord Vinayaka- నువ్వు ఏం వెళ్లనవసరం లేదు కానీ చెప్పేది శ్రద్ధగా విను

 Mooshika- సెలవివ్వండి స్వామి

 Lord Vinayaka- మా దేవుళ్ల రూపంలో అక్కడ చాలా మంది ప్రజలకు ప్రాణం పోస్తున్నారు. వారికి తగిన గౌరవం దక్కడం లేదు అదే నా బాధ.

 Mooshika- అవును స్వామి, నేను కూడా చాలా చూశా అలాంటి సంఘటనలు.

 Lord Vinayaka- ఇప్పుడు మేము చేసేది కూడా ఏం లేదయ్యా.. మానవులు జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వారు ఆ వ్యాధి నుంచి బయటపడలేరు.

 Mooshika- జాగ్రత్తలు అంటే ఎలాంటివి స్వామి

 Lord Vinayaka- అదేనయ్యా.. చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మర్చిపోయాను సుమా, ముఖానికి అడ్డంగా మాస్కు తప్పనిసరి

 Mooshika- ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా స్వామి.. వ్యాధి తగ్గిపోతుందా

 Lord Vinayaka- ఈ జాగ్రత్తలు పాటిస్తే ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకే ప్రమాదం తగ్గుతుంది. దాని ద్వారా రోగం కొద్ది కొద్దిగా తగ్గుతుంది.

 Mooshika- చాలా మంచి మాట చెప్పారు.. ఆగండి వెళ్లి భూలోకంలో చెప్పేసి వస్తా..

 Lord Vinayaka- త్వరగా రావయ్యా.. ఇక్కడ పూజ పనులు అవి నువ్వే కదా చూసుకోవాల్సింది.

 Mooshika- సరే స్వామి వేగిరమే వెళ్లి ఈ ఏడాది వినాయక చవితి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, మానవులు రోగం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి వస్తా..

 Lord Vinayaka- జాగ్రత్త సుమీ, అక్కడకి వెళ్లి బయట ఏమి తినకు, నీ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేయిస్తా. మర్చిపోకుండా మాస్కు పెట్టుకుని వెళ్లు, సానిటైజర్ కూడా తోడు ఉంచుకో ఎందుకైనా మంచిది.

Like Our Facebook Page ChuduBabai

Read our Thriler story Akankasha Episode 6

 882 Total Views,  1 Total Views Today

Comment Your Views