మేడారం జాతర వెనుక అసలు కథ

మేడారం

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర.. ఆదివాసీల పోరాటానికి చిహ్నంగా భావిస్తారు. ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీకగా కొలుస్తారు. సమ్మక్క-సారలమ్మలను గిరిజనులు ఆరాధ్య దేవతలుగా భావించి రెండేళ్లు ఒకసారి ఘనంగా నిర్వహిస్తారు. మేడారం జాతరలో కుల, మత, పేద, ధనిక వర్గాల తారతమ్యం లేకుండా మమేకం అవుతారు. అమ్మతల్లుల జాతరలో ఆదివాసులే కాదు, సకల జనులూ భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతోంది. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీట్లర దూరంలో ఉన్న తాడ్వాయి మండలం మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. సమ్మక్క-సారక్క జాతర దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందింది. రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క-సారలమ్మ చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

మేడారం

నేటి జగిత్యాల జిల్లాలోని పొలసాను పాలించే గిరిజన దొర మేడరాజు.. గోదావరి నది తీరంలోని అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లారు. ఆ సమయంలో ఒక పుట్ట వద్ద.. సింహాల మధ్య.. కేరింతలు కొడుతూ ఓ పసిపాప కనిపించింది. కోయదొరలు ఆ పాపను తమ వెంట గూడేనికి తీసుకెళ్లి వారే పెంచుకున్నారు. ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. సమ్మక్క చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. సమ్మక్కకు యుక్త వయసు వచ్చాక.. మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు.

మేడారం

కాకతీయ ప్రభువు మొదటి ప్రతాప రుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ప్రతాప రుద్రుడి దాడికి తట్టుకోలేక మేడరాజు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. మేడారాన్ని పాలించే కోయరాజు “పగిడిద్దరాజు” కాకతీయుల సామంతునిగా ఉంటూ… కరువు కాటకాల పరిస్థితుల కారణంగా పన్ను కట్టలేకపోతాడు. పన్ను కట్టలేకపోవడంతో పాటు మేడరాజకు ఆశ్రయం కల్పించడం, గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు రెచ్చగొడుతున్నారనే కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాప రుద్రుడు ఆగ్రహానికి గురవుతాడు. దీంతో తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.

మేడరాజు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు తమ సాయుధ బలగాలతో వేర్వేరు ప్రాంతాల నుంచి విరోచితంగా పోరాటం చేస్తారు. కానీ, కాకతీయుల సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ది చెందింది .

మేడారం

తన వారంతా మృతి చెండంతో సమ్మక్క.. కాళీమాతలా విజృంభించి శత్రువులతో విరోచితంగా పోరాడింది. ఈ క్రమంలో ఓ సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడవగా.. రక్తమోడుతూ ఆమె చిలుకల గుట్ట వైపు వెళ్లింది. ఆక్కడ ఓ మలుపు వద్ద కనిపించకుండా పోయినట్లు పురాణాలు చెబుతాయి. ఈ విషయం తెలిసిన గూడెంవాసులు సమ్మక్క కోసం ఆడవిలో గాలించారు. గుట్టపై ఉన్న నెమలినార చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరిణలా కనిపించింది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని… ఇక్కడ రెండు గద్దెలు కట్టి.. రెండేళ్ల కోసారి ఉత్సవం జరిపిస్తే.. వారి కోరికలను నెరవేరేస్తానని ఆకాశవాణి ద్వారా వినిపించిందని చెబుతుంటారు. ఆ తర్వాత ప్రతాప రుద్రుడు గిరిజనుల పన్నులను రద్దు చేసి.. సమ్మక్కకు భక్తుడిగా మారిపోతాడు. సమ్మక్క కుంకమ భరిణాల కనిపించిన చోట గద్దెలను కట్టించి.. రెండేళ్ల కోసారి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గద్దెలపైకి సమ్మక్కను తీసుకొచ్చే సమయానికి జిల్లా ఎస్పీ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరుపుతారు.

నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు కులమతాలకు అతీతంగా ఈ గిరిజన జాతరకు తరలివస్తారు.

Read About Khammam Trainee Collector Love Story Click Here

Like our Insta Page Chudubabai

 2,012 Total Views,  1 Total Views Today

Comment Your Views