The Supply Chain of Covid Vaccine

ప్రపంచం మొత్తం ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు ఆ శుభవార్త వింటామా అంటూ ఆశగా ఎదురు చూస్తోంది. ఇందులో చిన్న, పెద్ద తేడా లేదు, పేద, ధనిక అసమానతలు లేవు.. అందరి ఎదురు చూపులు దానిపైనే..

Covid Vaccine

          కోవిడ్ వ్యాక్సిన్.. అవును ఇప్పుడు ప్రపంచం మొత్తం దానికోసమే ఎదురు చూస్తోంది. 2019లో కోరలు చాచిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికి అనేక లక్షల మంది ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. మరి కరోనా వైరస్ సోకకుండా వైరస్ ను నివారించే వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది.

Covid Vaccine

          కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి.  బ్రిటన్, రష్యా, అమెరికా, భారత్, చైనా సహా అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీని ప్రారంభించాయి. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ కూడా జరుపుకుంటున్నాయి. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ మంచి ఫలితాలు ఇస్తున్నట్టు ఆయా సంస్థలు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 23 వ్యాక్సిన్స్ క్లినికల్  ట్రయల్స్ జరుగుతున్నాయి.

Covid Vaccine
First Covid Vaccine trails held at Oxford University

ప్రపంచంలో మొదటి కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో జరిగాయి. భారత్ లో భారత్ బయోటెక్ సంస్థ కో వ్యాక్సిన్ పేరుతో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. అదే విధంగా భారత్ లో మరో 5 సంస్థలు వ్యాక్సిన్ కనుగొనే పనిలో ఉన్నాయి. భారత్ లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా వ్యాక్సిన్ తయారీలో ఉంది. ఈ సంస్థకు డోసుల ఉత్పాదన, ప్రపంచవ్యాప్త అమ్మకాల విషయంలో ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ సంస్థల్లో పేరుగాంచింది.

          ఒకవేళ వ్యాక్సిన్ తయారీ అయితే అది ప్రపంచం నలుమూలలకి ఎలా చేరుతుంది అనేది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఏ దేశమైనా వ్యాక్సిన్ తయారీలో విజయం సాధిస్తే ముందుగా ఆ సంస్థలు పేటెంట్ తీసుకుంటాయి. అమెరికాలో వ్యాక్సిన్ మొదటగా తయారైతే… తొలి ప్రాధాన్యం అమెరికన్లకే ఇస్తామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయా దేశాలు ముందు తమ దేశ పౌరులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే మిగిలిన దేశాలకు అందిస్తాయి.

          వ్యాక్సిన్ సరఫరాపై సరైన ఒప్పందాలు జరగకపోతే చాలా పేద దేశాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నిజంగా శక్తివంతమైన వ్యాక్సిన్ తయారైతే అది ప్రపంచం మొత్తం అందించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో తయారీ సంస్థ పేటెంట్ పొందిన తర్వాత.. తమ దేశంలోని మిగిలిన ఫార్మా సంస్థలకు లైసెన్స్ ఇచ్చి తయారీకి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి ప్రతిపాదనలు జరుగుతున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. ఒక దేశం వ్యాక్సిన్ తయారీలో విజయం సాధిస్తే మిగిలిన దేశాలు వ్యాక్సిన్ తయారీని కొనసాగిస్తాయా.. లేదా ఆ వ్యాక్సిన్ తయారీ లైసెన్స్ పొంది తయారు చేస్తాయా అనేది వేచి చూడాలి.

          ఇప్పుడు వ్యాక్సిన్ తయారీ అయ్యాకా అది సామాన్య పౌరులకు అందించడం అన్ని దేశాలకు పెను సవాలుగా మారనుంది. భారత్ లోని 130 కోట్ల మందికి వ్యాక్సిన్ చేర్చడం పెద్ద సవాల్ గా ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. వ్యాక్సిన్ తయారయ్యాకా దానిని ప్రతీ గ్రామానికి, పట్టణానికి చేర్చాల్సి ఉంటుంది. దాని కోసం పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పౌరుడికి వ్యాక్సిన్ అందించేందుకు మన దగ్గర ఉన్న వైద్య వ్యవస్థ సరిపోతుందా అనే అనుమానాలు ఉన్నాయి.

ఒకవేళ వ్యాక్సిన్ తయారైతే.. దాని బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి. కరోనా డ్రగ్ కూడా ఇప్పటికే బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అలాంటిది వ్యాక్సిన్ వస్తే దాని బ్లాక్ మార్కెట్ నియంత్రణ జరుగుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా అందించాల్సి ఉంటుంది లేని పక్షంలో పేదవాడికి అది అందని ద్రాక్ష గా మిగిలిపోతుంది. ప్రభుత్వమే వ్యాక్సిన్ అందిస్తే అది ప్రజలకు ఎలా చేరుతుంది. ప్రభుత్వాసుపత్రుల ద్వారా వ్యాక్సిన్ అందిస్తే అది ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందో సరైనా అంచనా లేదు. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వ్యాక్సిన్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే..

Like Our Facebook Page Chudu Babai

Uknown Facts about Ayodhya’s Time Capsule- Read Here

 1,950 Total Views,  1 Total Views Today

Comment Your Views