పాత గుడి

Chapter 1

Patha Gudi

మట్టిపట్టిన ఆకుపచ్చ రంగు బోర్డులో మాయాపురం అని ఊరి పేరు కనిపించగానే.. బస్‌ డ్రైవర్‌ తన ముందున్న రేర్‌ వ్యూ మిర్రర్‌ నుంచి వెనక్కి చూసి.. ఏంటి సర్‌ ఇక్కడే దిగాలా..? అని అడగ్గానే అశోక్‌కు ఒక్క క్షణంపాటు అనుమానం కలిగింది.

డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేసి బస్సుని ఆపడంతో అశోక్‌ బ్యాగ్‌ సర్దుకుని కిందకి దిగాడు. బస్సు వెళ్లిన తర్వాత లేచిన ధూళిలో ఒంటరిగా నిలబడ్డాడు. పక్క ఊరి పంచాయితీలో సెక్రటరీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన అశోక్‌.. రెండు గ్రామాలకు సరిహద్దులో ఉన్న ప్రాంతంలో పాత సర్వే నెంబర్ల విషయంలో స్పష్టత కోసం మాయాపురం పంచాయితీ ఆఫీస్‌కు బయల్దేరాడు. అశోక్‌కి ఆ ఊళ్లోకి అడుగుపెట్టాలంటే ఇక నడకే మార్గం.

మధ్యాహ్నం ఎండలో కూడా ఆ ఊరి వీధులు వెలవెలబోతుంటాయి. ఈ ఊళ్లో ఏదైనా పని ఉండి పక్క ఊరి నుంచి ఎవరైనా వచ్చినా రాత్రికల్లా తిరిగి వెళ్లిపోతారు.

చుట్టూ దట్టమైన కొండలు, మధ్యాహ్నం పూట కూడా సూర్యరశ్మి నేలను తాకనివ్వని చెట్ల పొదలు. మాయాపురం.. బోర్డు చూడగానే.. ఆ పేరులోనే ఏదో నిగూఢమైన రహస్యం దాగి ఉందని అశోక్‌కి
అనిపించింది. అశోక్ తన భుజాన ఉన్న బ్యాగును సర్దుకుంటూ చుట్టూ చూశాడు. ఊరి పొలిమేరలో ఉన్న పాత మర్రిచెట్టు కొమ్మలకు ఎవరో కట్టిన గాజు ముక్కలు గాలికి ఒకదానికొకటి తగిలి “క్లింగ్‌.. క్లింగ్‌” మంటూ రోదిస్తున్నట్టుగా శబ్దం చేస్తున్నాయి.

పచ్చటి పొలాల మధ్య సన్నని మట్టి దారి. గాలి కూడా అచ్చంగా మెల్లగా ఊపిరి తీసుకుంటున్నట్టుగా వీస్తోంది. మొక్కలపైన పడిన సూర్యకాంతి కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. పొలం గట్లు, సన్నగా వీస్తున్న గాలిని చూస్తుంటే.. అశోక్‌కి ఆ ఊరు.. కొత్తగా అనిపించింది.

గాలిలో ఒక రకమైన పురాతన వాసన… తడి మట్టి, వెలిగి ఆరిపోయిన సాంబ్రాణి కలిసిన వింత వాసన అశోక్‌ ముక్కుకు గట్టిగా తగిలింది.

అశోక్‌కి ఎప్పుడూ ఇలాంటి నిశ్శబ్దం అలవాటు లేదు. ఫైళ్ల శబ్దాలు, ఫోన్‌ కాల్స్‌, ఆఫీస్‌లో ఇతరుల మాటలతో ఎప్పుడూ హడావిడిగానే ఉండే అశోక్‌కి.. ఈ మౌనం కొత్తగానే కాదు వింతగా కూడా అనిపిస్తోంది.

ఊళ్లోకి అడుగుపెట్టగానే.. అశోక్‌కు మనసు కుదురుగా అనిపించలేదు.. ఎప్పుడూ లేనంతగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. దూరం నుంచి కొండపైన ఉన్న పాత గుడి కనిపించగానే.. “హమ్మయ్యా..! ఇక ఎలాంటి భయం లేదు.. ఊళ్లోకి అడుగుపెట్టగానే దేవుడి దర్శనం అయ్యింది” అనుకుని.. మనసులోనే నమస్కారం చేసుకుని.. తన బ్యాగ్‌ని భుజానికి టైట్‌గా బిగించుకుని నడక కొనసాగించాడు. మధ్యాహ్నం నడి నెత్తి మీద సూర్యుడు తాండవం చేస్తున్నా.. అశోక్‌కి జనం మాత్రం కనిపించడం లేదు.

“ఈ ఊరు ఖాళీగా ఉంది.. ఖాళీగా ఉన్న చోట ఏదో దాగి ఉంటుంది” అని అశోక్‌ తన మనసులోనే అనుకున్నాడు.

పెద్ద గోపురం కాదు.. పెయింటింగ్‌ కూడా లేదు.. ఆలయం మొత్తం ఆకుపచ్చగా నాచు పట్టినట్టు ఉన్నా.. దూరం నుంచి చూస్తుంటే.. గోపురంపైన ఉన్న శిల్పాలు తననే చూస్తున్నట్టుగా.. కాలం అక్కడే
ఆగిపోయినట్టుగా.. అనిపించింది అశోక్‌కి. గుడి.. కొండపై దూరంగా ఉన్నా.. అశోక్‌కి మాత్రం చాలా స్పష్టంగా కనిపించడం మొదలైంది.

గుడి చుట్టూ పెద్దపెద్ద రాళ్లు.. వేప చెట్టు వేర్లు, బాగా పెరిగిన గడ్డి.. ఇదంతా చూసి అశోక్‌.. ఇది చాలా పాత గుడి అని తనలో తను అనుకున్నాడు.

ఊరి పొలిమేరలో ఒక టీ కొట్టు ఉంది. అక్కడ కూర్చున్న ముగ్గురు గ్రామపెద్దలు.. అశోక్‌ని చూడగానే తమలో తాము ఏదో గుసగుసలాడుకున్నారు. అశోక్ వారి దగ్గరకు వెళ్లి, “పెద్దాయన… ఇక్కడ
పంచాయితీ ఆఫీసు ఎటు వైపు ఉంటుంది?” అని ఒకతనని అడిగాడు.

తన చేతిలోని కర్రను నేలకు కొడుతూ, కొండ పైన ఉన్న పాత గుడి వైపు చూస్తున్న అశోక్‌ను పిలిచి.. “పంచాయితీ ఆఫీసు ఊరి మధ్యలో ఉంటుంది బాబు.. అయినా పంచాయితీ కోసం అడిగావు కానీ నీ కళ్ళు మాత్రం ఆ కొండ మీదే ఉన్నట్టున్నాయి. కొత్తగా వచ్చే ప్రతీ కళ్లు.. ఆ కొండపైన ఉన్న గుడినే చూస్తాయి. కానీ చూసిన కళ్ళన్నీ క్షేమంగా తిరిగి వెళ్లవు!” అన్నాడు గంభీరంగా.

తెల్లటి జుట్టు, నోట్లో చుట్ట, మాసిన పంచెతో ఉన్న ఆ పెద్దాయనను చూస్తేనే అర్ధమవుతోంది అశోక్‌కి.. అతనికున్న అనుభవం..

అశోక్‌కి ఆ మాటలు వింతగా అనిపించాయి. “అదేంటి పెద్దాయన… అలా అంటారు?” అని అడగబోతుండగా, “ఆ గుడి జోలికి వెళ్ళకు బాబు… అది అమ్మవారి ఇలాకా. అక్కడ గాలి కూడా ఆమె అనుమతి లేనిదే వీచదు,” అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు.

అశోక్‌కి ఆ ఊరి ప్రజల ప్రవర్తనలో ఏదో తెలియని రహస్యం దాగి ఉందని అర్థమైంది. పంచాయితీ ఆఫీసు వైపు నడుస్తున్న అశోక్‌కి, దారి పక్కన ఉన్న చెట్లపై పక్షులు కూడా వింతగా అరుస్తున్నట్టు వినిపించింది. అడుగులు ముందుకు వేస్తున్నా, అతని మనసు మాత్రం ఆ కొండపై ఉన్న పాత గుడి మీదే
ఉంది.

సరిగ్గా అప్పుడే… మేఘాలు కమ్ముకున్నాయి. అకాల వర్షం సూచనగా గాలి వేగంగా వీచడం మొదలైంది. దారి తప్పి, తనకు తెలియకుండానే అశోక్ కొండ వైపు వెళ్లే ఒంటిబాట దారిలోకి వచ్చాడు. ఆ దారి ఇరుగ్గా, రెండు వైపులా దట్టమైన పొదలతో నిండి ఉంది.

హఠాత్తుగా… గాలిలో ఒక వింతైన సువాసన. అది మల్లెపూల వాసన కాదు.. పచ్చ కర్పూరం, పాత కాలపు నూనె దీపాల వాసన. అశోక్ ఒక్కసారిగా భయంతో ఆగిపోయాడు. పంచాయితీకి వెళ్లాల్సిన తాను ఇలా గుడికి వెళ్తున్నాను ఏంటి అని వెనక్కి తిరిగి చూడగానే.. గాలిలో గజ్జెల శబ్దం చాలా మృదువుగా వినబడింది.

వెంటనే తిరిగి ముందుకు చూశాడు. ఆ శబ్దం కొండ పై నుండి వస్తున్నట్టుంది. అశోక్ తలెత్తి చూశాడు. అక్కడ పాత గుడి ముఖద్వారం వద్ద ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆకుపచ్చరంగు.. పరికిణి జాకెట్టు ఆ గుడిపై ఉన్న నాచుతో కలిసిపోయిందా అన్నట్టు అశోక్‌కు అనిపించింది. ఆమె చేతిలో ఒక వెండి గిన్నె ఉంది.

అంతలోనే ఒక భారీ కృష్ణసర్పం బుసలు కొడుతూ అశోక్‌ ముందు నుంచి వెళ్ళింది. అది మామూలు పాము కాదు, దాదాపు పది అడుగుల పొడవు ఉంది. అశోక్‌కు భయంతో ప్రాణాలు పోయినంత పనై, పక్కనే ఉన్న ఒక చెట్టును పట్టుకున్నాడు.

కానీ ఆ చిన్న అమ్మాయి భయపడలేదు. ఆమె నవ్వుకుంటూ వచ్చింది. “పిచ్చి నాగన్న… ఆగు! ఆకలి వేస్తోందా? పాలు తాగి వెళ్ళు!” అంటూ ఆ పాము వెనకే పొదల్లోకి పరిగెత్తింది.

అశోక్ గొంతు ఎండిపోయింది. “అమ్మా! పాప.. ఆగు! అటు వెళ్ళకు.. అది చంపేస్తుంది!” అని అరిచాడు. ఆ పాప ఒక్కసారిగా ఆగింది. వెనక్కి తిరిగి అశోక్ వైపు చూసింది. ఆమె కళ్లు మామూలు మనుషుల కళ్లలా లేవు.. లోతుగా, వెలుగుతున్న ప్రమిదల్లా ఉన్నాయి. ఆమె పెదవులపై వేలు వేసి, “ష్… నిశ్శబ్దం! చంపేస్తుందా? అమ్మ ఎవరినీ చంపదు.. కేవలం మాయం చేస్తుంది! ఈ విషయం ఎవరికీ చెప్పకు..” అని రహస్యంగా చెప్పి, ఒక మలుపు తిరిగి ఒక్క క్షణంలో పాముతో సహా మాయమైపోయింది.

అశోక్ ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది. చుట్టూ చూశాడు… కానీ అక్కడ ఎవరూ లేరు. తన భ్రమ అనుకుందామంటే, నేల మీద ఆ పాము వెళ్లిన చారలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.

ఆ గుడి ముందు నిల్చున్నప్పుడు అశోక్‌కు మొదట కనిపించింది.. అమ్మవారి విగ్రహం కాదు.. నేలకి కాస్త పైకి ఉన్న ఒక శిలాశాసనం.. వర్షం, ఎండ తినేసిన అక్షరాలతో.. కొన్ని పేర్లు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

“ఈ పేర్లు ఎందుకు రాశారు?” అని అశోక్‌ తనలో తానే అనుకున్నాడు.. దానిపైన గుప్త నిధుల కోసం వెళ్లి మాయమైన వాళ్లు అంటూ చాలా మంది పేర్లున్నాయి.

ఎక్కడైనా చనిపోయిన వాళ్ల పేర్లు రాస్తారు కానీ ఇక్కడ మాయమైన వాళ్లు అని రాయడం అశోక్‌ని మరింత భయానికి గురి చేసింది.

అశోక్‌కి గొంతు పెగలడం లేదు. అంతలోనే మళ్లీ గజ్జెల శబ్దం వినిపించింది. ఆ అమ్మాయి మళ్లీ వచ్చిందేమో అడుగుదామని అనుకున్నాడు.. ఆ గజ్జెల శబ్దం తన పక్క నుంచే వెళ్లింది. కానీ మనిషి మాత్రం కనిపించలేదు. భయం ఇంకా పెరిగింది. గాలి కూడా ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. అంతలోనే వాన వేగం పెరిగింది. పిడుగులు పడుతున్న శబ్దంతోపాటుగా గుడి లోపల ఎవరో పెద్దగా నవ్వుతున్నట్టుగా అతనికి అనిపించింది. అశోక్ అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊరి వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ అతని వెనకే ఎవరో నడుస్తున్నట్టు, గజ్జెల శబ్దం అతన్ని వెంబడిస్తున్నట్టు అనిపిస్తూనే ఉంది.

వేగంగా కొండ కిందకు పరిగెత్తడంతో అశోక్‌ ఆయాసపడ్డాడు. అసలేంటి ఈ ఊరు నాకెందుకు ఇలా అనిపిస్తోందంటూ మాయాపురం అని గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు.. అతనికి కనిపించిన మొదటి ఆర్టికల్.. “మాయాపురం: వందల ఏళ్ల మిస్టరీ… నిధుల కోసం వెళ్ళిన వాళ్లంతా ఏమయ్యారు?” భయపడి కిందకు వచ్చిన అశోక్.. పంచాయితీ ఆఫీసుకి వెళ్లాలనే ఆలోచన కూడా మర్చిపోయి, ప్రాణాలు చేతపట్టుకుని తిరిగి బస్సు స్టాప్ వైపు పరిగెత్తాడు.

చీకటి పడుతున్న వేళ, అదే పాత టీ కొట్టు దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్న అశోక్‌ని చూసి ఆ పెద్దాయన ఆశ్చర్యపోయాడు. “అదేంటి బాబు… పంచాయితీకి వెళ్తానని అప్పుడే తిరిగి బస్సు కోసం వచ్చావు?” అని అడుగుతూనే,

అశోక్ ముఖంలో ఉన్న భయాన్ని గమనించాడు. “అంటే… నువ్వు ఆ కొండ ఎక్కావా ఏంటి?” అశోక్ ఏమీ మాట్లాడలేక కేవలం తల ఊపాడు.

పెద్దాయన కళ్లలో వింతైన మెరుపు మెరిసింది. “అమ్మో! కొండ ఎక్కిన వారెవరూ ఇంత త్వరగా, క్షేమంగా తిరిగి రాలేదు నాయనా. నువ్వు మళ్ళీ ఈ బస్‌ స్టాండ్‌ దాకా వచ్చావంటే… నీకు భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్టే! అమ్మవారు నిన్ను వదిలేసిందంటే అది నీ అదృష్టం కాదు, నీకోసం ఏదో పెద్దది దాచి ఉందని అర్థం!”

అంతలోనే బస్సు హారన్ వినిపించింది. అశోక్ ఆ పెద్దాయన మాటలకు సమాధానం చెప్పకుండానే, ప్రాణం
దక్కిందని బస్సు రాగానే ఎక్కేశాడు. ఆ రాత్రి అశోక్‌కి తన గదిలో నిద్ర పట్టడం లేదు. కళ్లు మూస్తే ఆ పాత గుడి గోపురం… ఆ కృష్ణ సర్పం బుసలు… అన్నిటికంటే ముఖ్యంగా ఆ చిన్న పాప కళ్లు వెలుగుతున్న ప్రమిదల్లా కనిపిస్తున్నాయి.

అమ్మ ఎవరినీ చంపదు.. కేవలం మాయం చేస్తుంది!” అన్న ఆమె మాటలు అతని చెవుల్లో పదే పదే వినిపిస్తున్నాయి. అసలు ఆ గుడి రహస్యం ఏంటి? తెల్లవారగానే ఎలాగైనా దాని గురించి తెలుసుకోవాలని
అశోక్ నిర్ణయించుకున్నాడు.

For next 10 Chapters Patha Gudi Book Links :

Amazon
Notion Press ( Use Coupon Code: WORLDBOOKDAYDEA to get 15% off)
Flipkart
Read our another story Tholiprema

Loading

Comment Your Views