Whole world is looking for Covid Vaccine. Putin announces the vaccine from Russia. Is there any chance to get Russia Covid Vaccine in India?

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసిందోచ్.. ఇక కరోనాను తరిమికొట్టేద్దాం అంటూ సంబరపడుతున్నారా.. కరోనాకు తొలి టీకాను రష్యా విడుదల చేయడంతో ప్రపంచం మొత్తానికి ఊరట కలిగింది. ఆగష్టు 12న కరోనా తొలి టీకాను విడుదల చేశామని, తొలి టీకా తన కుమార్తెపై ప్రయోగించడం జరిగిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.

ఇంత త్వరగా వచ్చిన కరోనా టీకా స్పుత్నిక్ వీ తయారీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలీ టీకా సమర్ధతకు ఆధారాలు చెప్పకుండా వ్యాక్సిన్ ట్రయల్స్ వివరాలు వెల్లడించకుండా టీకాను విడుదల చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
రెండు నెలల కంటే తక్కువ టైంలో ట్రయల్స్ నిర్వహించి వ్యాక్సిన్ విడుదల చేయడంపై భారత్ సహా పలు దేశాలు రష్యాపై మండిపడుతున్నాయి. వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఎలాంటి దుష్ప్రభావాలు లేవని నిర్ధారణ అయిన తర్వాత కానీ వ్యాక్సిన్ కు అనుమతి ఉండదు. అలాంటిది ఏ రకంగా రష్యా టీకా విడుదల చేసిందో చెప్పాలని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి.

ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకుండా, ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ వివరాలు చెప్పకుండా రష్యా వ్యాక్సిన్ రిలీజ్ చేసింది. మరి ఈ రష్యా వ్యాక్సిన్ మన దేశానికి అందుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు. వ్యాక్సిన్ ను ఇతర దేశాలకు అందించాలంటే ముందుగా ఆయా దేశాలు రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి, అదే విధంగా ప్రొడక్షన్ కూడా కీలకం కానుంది. వ్యాక్సిన్ తయారు చేసిన గమాలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రష్యాలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన సిస్టమా ప్లాంట్ లో వ్యాక్సిన్ తయారీని చేపట్టింది. ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ అందించే సామర్ధ్యం సిస్టమా ప్లాంట్ కు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం ఏడాదికి 15 లక్షల డోసులు మాత్రమే తయారు చేసే సామర్ధ్యం మాత్రమే ఉంది. అయితే ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుతామని, మొదటి బ్యాచ్ వ్యాక్సిన్లను సిద్ధం చేశామని సిస్టమా చెబుతోంది.
ఇప్పటికే తమకు వివిధ దేశాల నుంచి 100 కోట్ల డోసులు ఆర్డర్లు వచ్చాయని.. ఏటా 50 కోట్ల డోసులు ఆయా దేశాల్లోనే తయారు చేసేలా ఒప్పందాలు చేసుకున్నట్టు రష్యా ప్రకటించింది. వ్యాక్సిన్ పై భారత్ ఇప్పటికి ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే విడుదలైన రష్యా వ్యాక్సిన్ పై హోప్స్ పెట్టుకోవద్దని అంటున్నారు భారతీయ శాస్త్రవేత్తలు.

వివిధ దేశాల్లో తయారైన వ్యాక్సిన్లు ఇతర దేశాలకు అందించే సమయంలో వాటిని ఆయా దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తుంటారు. ఆ దేశ ప్రజలు ఆ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని తట్టుకోగలరో లేదో తెలుసుకునేందుకు లేట్ ఫేజ్ ట్రయల్స్ చేపడతారు. ఇక భారత్ లో రష్యా వ్యాక్సిన్ రావాలంటే సెంట్రల్ డ్రగ్స్స స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతులు తప్పనిసరి. అయితే ముందుగా ఫేజ్ 2, ఫేజ్ 3 పరీక్షలు భారత్ లో పూర్తి చేసి విజయం సాధిస్తే తప్ప భారత్ లో రష్యా వ్యాక్సిన్ కి అనుమతి దక్కదు.
ఆ కారణంగానే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ భారత్ లో కూడా ట్రయల్స్ జరుపుకుంటున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ ను భారత్ లో తయారు చేసేందుకు పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అందులో భాగంగానే CDSCO అనుమతులు తీసుకుని అన్ని ఫేజ్ లను దాటుకుని ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభించింది.

ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ భారత్ లో రావాలన్నా ఇదే విధానాన్ని ఫాలో అవాల్సి ఉంటుంది. ముందుగా భారత్ లో ఏదైనా కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకా మూడు ఫేజ్ ల ట్రయల్స్ పూర్తి చేసుకోవాలి. దానికి రెండు నుంచి మూడు నెలలు సమయం పడుతుంది. దీనిని బట్టి రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ టీకా భారత్ లో అడుగు పెట్టాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టవచ్చు.
ట్రయల్స్ లేకుండా ఎమర్జెన్సీ యూజ్ కింద CDSCO టీకాను విడుదల చేసే అవకాశం ఉంది. రష్యాలో జరిగిన హ్యూమన్ ట్రయల్స్ పై నమ్మకం ఉంటే భారత్ లో ఎలాంటి హ్యూమన్ ట్రయల్స్ లేకుండానే అనుమతులు ఇచ్చే అధికారం CDSCOకు ఉంది. అయితే రష్యాలో ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ ఫలితాలు చెప్పకుండా ఫేజ్ 3 ట్రయల్స్ లేకుండా విడుదల చేయడంపై పలు అనుమానాలు ఉండడంతో భారత్ ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం లేదు. ఎమర్జెన్సీ యూజ్ కింద అమెరికాకు చెందిన రెమిడిసివిర్ కోవిడ్ డ్రగ్ భారత్ లో విడుదలైంది. ఆ డ్రగ్ కేవలం పేషెంట్స్ కి మాత్రమే ఇస్తారు. కానీ వ్యాక్సిన్ పెద్ద సంఖ్యలో జనానికి ఇవ్వాల్సి ఉంటుంది. కొద్ది తేడా వచ్చినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ వద్దని సూచిస్తున్నారు. కాబట్టి వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి కాకుండా రష్యా వ్యాక్సిన్ భారత్ లోకి వచ్చే అవకాశం లేదు.
ఎలాగూ రష్యా వ్యాక్సిన్ ఇప్పట్లో భారత్ లోకి అడుగుపెట్టే అకాశం లేదు కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా తమను తాము రక్షించుకోవాలి. మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించడం తప్ప ప్రస్తుతానికి భారత్ లో చేసేదేమి లేదు.
మీకు తెలిసిన వారు ఎవరైనా కరోనా నుంచి కోలుకుని ఉంటే.. వారు ప్లాస్మా దానం చేసేలా ప్రొత్సహించండి.. మరొకరి ప్రాణం కాపాడండి.
ప్లాస్మా దానంపై మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి- Donate Plasma Save Lives
Follow Our Facebook Page ChuduBabai
![]()
- చిరంజీవి.. ఇండస్ట్రీ కోసం తగ్గాడు..నెగ్గాడు - February 12, 2022
- రైలు ప్రయాణం లేని దేశాలేంటో తెలుసా..? - February 11, 2022
- కశ్మీర్ లో రైలు ప్రయాణం ఇకపై మేఘాల్లో.. - February 11, 2022
