ఏ చిన్న సమస్య వచ్చినా… వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక చాలా మంది తనువు చాలిస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారనో.. ప్రేమ విఫలమైందనో.. కుటుంబ కలహాలతోనో.. ఇలా చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టం రావడంతో రైతులు.. చేసిన అప్పులు తీర్చలేక కొందరు.. ఉద్యోగం రాలేదని మరికొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.
దేశంలో పలు సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. నిరుద్యోగం, అప్పులు, దివాలా కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు.. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) షాకింగ్ విషయాలు వెల్లడించింది. గత మూడేళ్లలో 25 వేల మంది ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. బిజినెస్‌లో నష్టం రావడంతో కంపెనీ దివాలా కావాడం లేదా అప్పుల కారణంగా 16వేల మంది సూసైడ్ చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతే కాకుండా నిరుద్యోగం కారణంగా తొమ్మిది వేల మందికి పైగా బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు పేర్కొంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం.. 2018, 2019, 2020 సంవత్సరాల్లో 25,000 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలు ముఖ్యంగా నిరుద్యోగం, అప్పులు, దివాలా వంటి కారణాలతో జరిగినట్లు వెల్లడైంది. ఈ మూడేళ్లలో అత్యధికంగా 2020లో అత్యధికంగా జరిగినట్లు పేర్కొంది.
గత మూడేళ్లలో అప్పులు, దివాలా కారణంగా 16,091 మంది సూసైడ్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 2020లోనే 5,213 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో 5,908 మంది ప్రాణాలు తీసుకోగా, 2018లో 4,970 మంది బలవన్మరణం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నిరుద్యోగం కారణంగా మూడేళ్లలో 9,140 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2020లో 3,548 మంది తనువు చాలించారు. 2019లో 2,851 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2018లో 2,741 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు NCRB అందించిన డేటా ఆధారంగా ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా వివరాలను అందించారు.
దేశంలో బీజేపీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న నేపథ్యంలో.. ఎన్డీయే సర్కార్ ఆత్మహత్యలపై షాకింగ్ విషయాలను బయటపెట్టింది. దేశంలో ఇప్పటివరకు రైతులు అప్పుల పాలై చనిపోతుండగా.. తాజాగా నిరుద్యోగం, అప్పులు, దివాలా కారణంగా చాలా మంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది.
ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 2019తో పోలిస్తే 10 శాతం కంటే అధికంగా ఉన్నట్లు NCRB నివేదిక గణాంకాలు పేర్కొన్నాయి. బలవంతంగా తమ ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆత్మహత్యలకు ప్రజల్లో అధికమవుతున్న మానసిక దౌర్బల్యమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వాలతో పాటు సమాజంపైనా దీనికి పరిష్కారాలు కనుగొనే బాధ్యత ఉందని పలు సర్వేలు వెల్లడించాయి.
Read Our Special Article on Megastar Chiranjeevi Click here
Like our Insta Page Chudubabai
1,501 Total Views, 2 Total Views Today
- మేడారం జాతర వెనుక అసలు కథ - February 18, 2022
- కలెక్టర్ గారి ప్రేమ కథా చిత్రమ్ - February 17, 2022
- సినీ తారలు.. విడాకులు - February 17, 2022